Sunday, July 26, 2009

సిలికాన్ సిటీ లో సెర్చింగ్ (ఉద్యోగపర్వం - త్రుతియాశ్వాసం )

సిలికాన్ సిటీ లో సెర్చింగ్ (ఉద్యోగపర్వం - త్రుతియాశ్వాసం )

సిలికాన్ సిటీలో సిల్లీగా సిందులు వేయకుండా; అప్పటికి ఉన్న ఒకే ఒక ఆశ "ఉద్యోగం" దానికోసం మాత్రమే వెతుకులాట సాగించాలనీ మొండిగా నన్ను భరిలో దింపింది మాత్రం కొందరు నా అప్తమిత్రులు అని సగర్వంగా చెప్పగలను.హైదరాబాదులో చేసిన హంటిగ్‌కి మెరుగులు దిద్దటానికా అన్నట్టు, నా జీవితపు ప్రవాహానికి సరయిన ఆనకట్ట వేసి ఖచిత్తమైన మలుపు తిప్పి దాన్ని సరయిన సర్దుబాటు చేసినవారందరికీ ఈ టపా అంకితం.

అప్పటికే నా స్నేహితులలో చాలామందికి ఉద్యోగప్రయత్నం నెరవేరడంతో, అప్పటివరకు వాళ్ళు ఉంటున్న ఒక చిన్న గదిని మాకోసం అట్టిపెట్టి వాళ్ళు అఫీసు దగ్గరలో తీసుకున్న వెరే రూంకి వెళ్ళబోతూ "అసలే ఆలస్యంగా అడుగుపెట్టావ్, ఎంతో కష్టపడితే గానీ జాబ్ రాదు" అని ఒకే ఒక్క మాట నాలో ఉన్న నమ్మకాన్ని కొంచం తగ్గిస్తూ, అవసరాన్ని సూటిగా గుర్తుచేస్తూ,మొహమాటాలకి పోకుండా అక్కడి నుండీ "ఆలస్యం అమృతం అన్నట్టు వెళ్ళిపోయారు". ఆలస్యం చేసిన నాకు అప్పుడు వాళ్ళు నిజానికి జాబ్ అనే అమృతం సేవిస్తున్న సురుల మాదిరి కనపడ్డారు.నేను అసురుడిని కాకపొయినా సూరత్వం చూపాలంటే అమృతం అస్వాదించాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నా.

అప్పుడే బెంగుళూరులో ట్రైను దిగిన నాకు, ఎదో ఆందోళనతో అదే ప్లాట్‌ఫారం మీద నాకోసం ఎదురుచూస్తూ నావైపుగా నడిచివస్తున్న నా నేస్తం కనపడ్డాడు. పాచిమొహంతోనే పైకి నవ్వాను , బరువయిన బ్యాగులతో దిగిన నాచేతిలోంచీ ఒక బ్యాగ్ తీసుకుంటూ అదరాబిదరా ఆటుగా నడువురా అంటూ మెజెస్టిక్ బస్ స్టాండ్ వైపు నడిపాడు.రెండు చేతులలో మోయలేనంత బరువున్న నేను ఆటో కోసం నడిపిస్తున్నాడు అని తలచి అమాయాకంగా "బరువుగా ఉన్నాయి" అని బాదిస్తూనే నడవసాగాను. అంత బరువుమోస్తున్న బాధలో వాడి ఆందోలణ సరిగా అర్దం కాలేదు.

మొత్తనికి చాలా చమటలు కక్కుతు ప్లాట్‌ఫారంలన్నీ దాటుతూ 22వ ప్లాట్‌ఫారంకి చేరిన నన్ను అలుపన్నా తీర్చుకోకుండానే 271 వెళ్ళిపోతుందిరా త్వరగా..త్వరగా అంటూ నా బరువయిన బోలెడంత లగేజీతో బస్ ఎక్కించాడు. ఎక్కిన తర్వాత కొంతసేపటికి ఇద్దరికీ సీటు దొరకటంతో హమ్మయ్య అనుకుంటూ .... ఎంటిరా కండక్టరు ఇందాక ఎదో "వలగడ బన్నీ" అంటున్నడు, బహుసా నా లగేజి చూసి ఎందుకు చిన్నా(=బన్నీ) అన్ని బ్యాగులు (=వలగడ) అని కన్నడాలో అడుగుతున్నడా అని అన్నాను ? వాడు పెద్దగా నవ్వలేదు గనీ "వలగడ బనీ" అంటే "లోపలకి రా" అని అర్ధంరా అనిచెప్పాడు. నా అమాయకత్వానికి సిగ్గుపడక పోగా మరీ హైదరబాదులో బస్ దిగు అనటానికి "ఉతార్" అంటారు రా మరి ఇక్కడ ? అని ఒక వెర్రిప్రశ్న వేసా! దానికి బదులు ఇస్తున్నట్టుగా ఇక్కడ బస్ కదిలే లోపే ఎక్కెయాలి రా గుర్తుపెట్టుకో అన్నాడు(సాధారణంగా మనం అడిగిన ప్రశ్నకి ఎప్పుడూ సమాధానం ఇవ్వడు కాబట్టి ....పెద్దగా పట్టించుకోలేదు ). దానికి నేను ఆ విషయం గురించి "తూ ఫికర్ మత్" అని అప్పుడప్పుడే వంటపడుతున్న హైదరాబాదీ హిందీలో చెపుతూ "హైదరాబదులో రన్నింగ్ బస్ ఎక్కటం, పైగా ఫుట్‌బోర్డ్ మీద ఫుల్ల్ గా వేలాడుతూ వెల్లటంలో నేను కింగ్‌రా " అని హైదరబాదు గొప్పలకి పోయా.వెంటనే , ఇక్కడ నువ్వు వెలాడతానన్న బస్ కదిలాక ఎక్క నివ్వరు ఎందుకంటే ఇక్కడ బస్సులు అన్నిటికీ ఆటోమేటిక్ డోర్లు; బస్ కదలగానే మూసుకుపోతాయి అన్నాడు. అంతే అప్పుడు అర్ధం అయ్యింది బెంగుళూరులో చాల బొమ్మలాటలున్నాయి అని.

నెమ్మదిగా నా అర చేతి నొప్పులు తగ్గాయి అనుకునే లోపల మనం దిగాల్సిన స్టాపు వస్తుంది లగేజి అదీ తీసుకో అన్నాడు.హడావిడిగా అన్నీ తీసుకుని ఆటో పిలవరా అన్నా , హెయ్ ఎందుకు రా రూం ఇక్కడే పదా అన్నాడు, చేసేదిలేక మొహమాటంగా వాడి అడుగులో అడుగేస్తూ దిక్కులు చూడకుండా (ఎందుకంటే చుసేలాగా పరిస్తితి లేదుకాబట్టి!) కొంత సేపటికి రూంకి చేరాను.ఇదే రా నీ రూం ఒకే గది విత్ అటాచిడ్ బాత్‌రూం, ఎలా ఉంది అన్నాడు? వచ్హేసరికి రూం తీసాడు అదే చాలు చిన్నదైతే ఏముందిలే ..బాగుంది రా మాకు సరిపోతుంది (త్వరలో నాలాగా హైదరాబాదు నుండీ రాబోతున్న ఇంకో ఫ్రెండ్ ని దృష్టిలో పెట్టుకుని ) అన్నాను.

సరే అయితే నువ్వు స్నానం అదీ చేయ్ నేను ఆఫీస్కి వెల్తా ఇప్పటికే ట్రైను లేటు అవ్వటంతో బాగా ఆలస్యం అయ్యింది అంటూ బయలుదేరాడు.ఒహో! ఇప్పటివరకూ అదా వీడి అందోళణ ఎంటా అనుకున్నా! షాపింగ్ కి వెళ్ళాలిరా ఉంటావనుకున్న సరేలే సరదగా ఏరియా అదీ చూసినట్టు ఉంటుంది నేనే వెల్తానులే అన్నా! ఆ రోజంతా ఎదో స్నానం చేసినా గని ఒకటే చిరాకు. దగ్గరలోనే ఉదయం మా వాడు వస్తున్నప్పుడు చూపించిన హోటల్లో టిఫిన్ కూడా నచ్హలేదు. బహుసా ఇదంతా హైదరాబాదుకి అలవాటుపడటంవల్లనేమో. ఇక్కడ నీళ్ళు బాగా చల్లగా ఉంటాయి హీటరు అవసరం అనటంతో అది కొందామని బయటకి వెళ్ళి దానితో పాటుగా ఖర్చులు తగ్గించాలి అన్న ఉద్దెశ్యంతో ఒక ఐరన్ బాక్స్ కొని రూంకి చేరా...

అప్పుడు మోదలు అసలు సినిమా ! అర చెయ్య అంతా ఒకటే దురద, మంటలు. బహుసా ఇక్కడ నీళ్ళు పడలేదేమో అని సర్దుకుని ఓర్చుకున్నా, ఆ రాత్రికి ఎలాగో గడిచింది. తెల్లవారినా నాకూ పెద్దగా తేడా తెలియలేదు. అంతకుముందు రోజు ఆ బిల్డింగ్‌లో ఉన్న ఒక ఫ్రెండ్ ని ఆరు సార్లూ ఆ ఏరియా పేరు అడిగి తెలుసుకోవటంతో నా అమాయకత్వం నచ్హి , నా దగ్గరకి వచ్హి టిఫిన్ అయ్యిందా అన్నాడు ? టిఫిన్ కోసం పెద్ద బాద లేదు గని అర్జంటుగా డాక్టరు ద్గ్గరికి వెళ్ళాలి ఎదైనా చెప్పు అన్నాను. తెల్లమోహం వేయటంతో నేనే రోడ్డున పడ్డా, ఉదయానే కావటంతో పెద్దగా ప్రయోజనంలేకపోయింది. కొంతసేపటికి కేరళా ఆయుర్వేద శాల అని కనపడింది. ఎదొ ఒకటే సమస్య పక్క వాడికి చెప్తే ఉపశమనం ఉంటుందని లోపలికి వెళ్ళా, లేడీ డాక్టర్ ! కొంచం సిగ్గు, అయినాగని అడగటంతో అరచేతులు చూపిస్తూ కెవలం అరచేతులు మాత్రమే మంట మరియూ దురదా అని చెప్పా !!

వెంటనే ఆమే నిన్న తాడు లాగటం ఎదినా బరువయిన దానిని లాగటం చేసారా అనటంతో అప్పుడు ఎలిగింది లైటు. అవును డాక్టర్ నిన్న కాస్త బరువైన లగేజీ మోసాను అన్నా !! దానితో డాక్టరు ఒక చిరునవ్వు నవ్వీ ఈ ఆయిలు అరచేతికి రాసి అరగంట ఆరనివ్వాలి, ఆ తర్వాత గోరువెచ్హని నీటిలో మరో అరగంట నాన నివ్వాలి అని చెప్పింది. అన్ని విన్నను గానీ అసలు కారణం తెలుసుకోవాలి అనిపించటంతో దాచుకోలేక అడిగేసా , డాకటరు చెప్పింది ఏమిటంటే తనకి మించిన బరువుని మోయటంవల్ల అర చేతిలో సున్నితమయిన చాలా రక్త నాళాలు తెగిపొయాయి అనీనూ దాని కారణంగా విస్రుతంగా పొంగిన రక్తం చర్మపు అడుగు పొరలో ఉండిపోవటం వల్ల రాన్నున రోజుల్లో అర చేయి పలు రంగులు ప్రదర్సిస్తుందనీను చెప్పింది.అవన్నీ విన్న నాకు ఒక్క క్షణంలో చాలా రంగులే కనపడ్డాయి.

నిన్న కొన్న హీటరు ఇలా ఉపయోగపడిందన్నమాట అనుకుని, దాన్ని నీళ్ళలో పెట్టా. ఆ కేరళా ఎర్ర ఆముధాన్ని అరచేతికి రాసుకుంటూ "కూటి కోసం, కూలి కోసం, పట్నమొచ్హిన బాటసారీ ఎంత కష్టం ..ఎంత కష్టం ....." అని శ్రీ శ్రీ గారి పాట పాడుకుంటూ, సమస్య ఇట్టే పసిగట్టిన కేరళా లేడీ డాక్టరుని ఊహించుకుంటూ, ఎప్పుడో నాన్న అన్న మాటలు నెమరువేసుకున్నా !! అవి ఎమిటంటే ఇంటిదగ్గర పెరటిలో చిరాకుగా పెరిగిన చెట్లని కొడుతున్న నాన్న కి సహాయం చెద్దామని దగ్గరకి వెల్తే "మీరు కంప్యూటర్ మీద చేతులు ఆడించటానికే గనీ దేనికి పనికిరారు రా" అనేవారు . అది గుర్తు రావటంతోనే సినిమాలో లాగా మూటలు మోసి అయినా...అనే ఆలోచనలకి తెర దించేసా..మొత్తానికి నా చేతులు కాస్త సరి అవ్వటానికి, నేను బెంగుళూరుకి అలవాటుపడటానికి కొంత సమయం పట్టింది.

ఇంతలో రానే వచ్హింది కాలేజి నుండి కాల్ ! అది సత్యం ఆఫ్‌కాంపస్. పరీక్ష అంధ్రాలో కావటంతో ఎదైనా పొయిన చోటే వెతుక్కొవాలి అన్న చందాన ఈ సారి ఎలగయినా సత్యంలో సీటు సంపాదించాలని అత్యుత్సాహంతో బయలుదేరా, రైల్వే స్టేషన్‌కి టికెట్ట్ బుక్ చేయటానికి. మొత్తనికి సత్యంకి సంబందించిన చాల మంది దగ్గర విజయగాదలు విని (పరీక్ష కి సంబందించిన వివరాలు, ఇంటర్వ్యూలో ఆడిగే ప్రశ్నలూ) బాగా బుర్రకి ఎక్కించుకుని ఇంటికి ప్రాయాణం అయ్యా !

"అమ్మ కడుపు చూస్తుంది , పెళ్ళాం జేబు చూస్తుంది" అన్నట్టు; ఇంటికి వెల్లగానే చుట్టు పక్కన వాళ్ళు ఇంకా జాబ్ రాలేదా ?? (అప్పటికి పెళ్ళాం లేక పొయినా ...ఆ మాదిరి) అనీనూ అమ్మెమో ఆ చేతులు ఎమిటిరా అలా అయిపోయాయి అనడంతో ఒక్కసారి కావేరీ కళ్ళలో కట్టలు తెంచుకున్నంత పర్యంతం అయ్యింది. మొత్తానికి చేతి వంకన అమ్మ చేతి గోరుముద్దలు తింటూ(ఇప్పటికీ తింటూనే ఉంటాననుకోండి !! అంత రుచిగా ఉంటుంది మరి) ఎక్సాంకోసం ప్రెపేర్ అవుతున్న నాకు అమ్మ నెమ్మదిగా నీకు సత్యం రాదేమో రా !!అంది. అదేంటమ్మా? అంత మాటాన్నావు ?-"నీ జాతకంలో నీకు జాబ్ ఇటుగా రాదు పైగా అది వచ్హే నెలలో వస్తుంది అని ఉందిరా అంది"పెద్దగా షాక్ తినలేదు గని అమ్మ ఇలానే అంటుంది అనుకుని మరుసటి ఉదయం ఎంచక్కా ఎక్సాం కి వెళ్ళా, మొదటి రెండు రౌండ్లూ సెలెక్ట్ అయి పోయా ఇక ఫైనల్ రౌండ్ చాలా సులువు వచ్హేసినట్టే అన్న ధీమాతో అమ్మకి ఫోన్ చేసి గొప్పగా చెప్పా! కానీ ఆశ్చర్యంగా ఆఖరి రౌండ్ తేడా చేసెసింది. నా ఉత్సహాం మొత్తం నీరు గారి పొయింది. మొత్తానికి అమ్మ చెప్పినట్టే జరిగిందనిపించింది. చేసేది లేక ఇంటి ముఖం పట్టాను.

ఆ మరుసటి రోజు ఇంకో రెండు రోజులలో మళ్ళీ బెంగుళూరు వెళ్ళబోతాననగా గుడికి తీసుకెళ్ళి ఎదో పూజ చెయించి మన చేతికి ఒక గోమెధకం రాయి ఉన్న ఉంగరం తొడిగించారు నాన్న. ఎంటో జాబ్ లేని నా మీద ఇంకా నాన్న కి ఇంత ప్రేమ అనుకుని ఇంటికెళ్ళా, అప్పుడు అమ్మ చెప్పిందేమిటి అంటే జాతక ప్రకారం ఆ కాలంలో ఉన్న అకాల దోషాలన్నీ పోవాలనీ ఆ ఉంగరం చెయించామని చెప్పింది. కామన్‌గానే అమ్మ చెప్పేది లక్ష్య పెట్టకుండా,"అంటే ఇది పెట్టుకుంటే జాబ్ వచ్హేస్తునందా అని వెటకరించా !!" మొత్తానికి దానిగురించి నేను మరచిపొయినా కొత్తగా చూసిన ఫ్రెండ్స్ అంతా "ఎమిటి రా వేలు వాచింది?" అంటూ అమ్మ అన్న మాటలు గుర్తుచేస్తూనే ఉన్నాయి.

మొత్తానికి బెంగుళూరు చేరీ చేరగానే ఒక ఫ్రెండు వాడికి జాబ్ ఇచ్హిన కన్సల్‌టెన్సీ లో ఇంకా జాబులు ఉన్నాయి అని చెప్పటంతో వెంటనే అక్కడికి చేరా!వాళ్ళు పెట్టిన పరీక్షలూ ఇంటర్వ్యూలలో మెప్పించటంతో తరువాయి ఫైనల్ క్లైంటు రౌండు SAP Labs లో అని చెప్పాడు. దానితో పాటు మనకి డ్రెస్సింగు గురించి కూడా కొన్ని సముచిత సలహాలు ఇచ్హి పంపాడు.

మొత్తానికి SAP labs లో ఇంటర్వ్యూ కి వెల్లిన నాకు అది నిజంగా మరచిపొలేని రోజు. కంపెనీ పిచ్హెక్కించింది అంటే నమ్మండి పెద్ద కార్ పార్కింగ్ ప్రాగణం అన్నీ పెద్ద కారులే, అద్దాల మేడ మెరిసిపోతుంది, నా ఇంటర్వ్యూ మిట్టమద్యానం కావటంతో సూర్యకిరణాల సరాసరి ఆ అద్దలమేడ మీద పడి నా కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. ఆ తళుకు బెళుకుల తన్మయత్వం నుండీ తప్పించుకుని నెమ్మదిగా నా ఇంటర్వ్యూ గదికి చేరుకున్నా. బయట ఎండ వేడి తట్టుకొలేకపొయా అని బాధ తో లోపలికి అడుగుపెడితే లోపల AC దెబ్బకి చలి బాధ ఎక్కువయింది. అలానే నెమ్మదిగా వళ్ళు పెట్టిన పరీక్ష ఉత్తీర్నుడనవ్వటంతో వెంటనే ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పి అక్కడే వెయిట్ చేయమన్నారు.

నిజంగా నా జీవితంలో అదొక మరుపురాని ఇంటర్వ్యూ అని చెప్పాలి, కొంతసేపటికి ప్రారంభమయిన ఆ ఇంటవ్యూలో నాకు కొన్ని పజిల్స్ ఇచ్హరు అవి సాల్వు చేసిన పిమ్మట ఒకే ఒక్క ప్రశ్న అడిగారు, అదే నాకు నచ్హిన సినిమా ఎమిటి అని ? తడపడ కుండా అప్పట్లో ఫ్రెండ్ తెచ్హిన DVD లో చూసి నాకు బాగా బాగా బాగా నచ్హిన సినిమా అయిన "రంగ్ దే బసంతి" (Rang de basanti) అని చెప్పా. వెంటనే ఆ మెనేజర్ మొహంలో ఒక చిరునవ్వు. నాకు దాని అర్దం అప్పుడు తెలీదు , వెనువెంటనే ఆ సినిమా గురించి చెప్పమన్నాడు, ఇంకా అది ఎందుకు నచ్హిందో చెప్పమని అన్నాడు - దానితో ఎక్కువ ఎమీ ఆలోచించకుండానే నాకు అందులో నచ్హిన పలు పాసిటివ్ విషయాలన్నీ గుర్తు చేసా. దానితో ఇంప్రెస్స్ అయిపొయిన మేనేజరు కన్సెల్టెన్సీ వాళ్ళు నాకు మిగిలిన విషయాలు చెప్తారని ఇక వెళ్ళవచ్హు అని చెప్పాడు, దానితో సంత్రుప్తి చెందని నేను వెంటనే నా మనసు తెలియచెయటంతో, (It is a +ve sign, Be happy)అని చెప్పటంతో నా ఆనందానికి అవధులు లేవు. అలా రూంకి వచ్హిన తర్వాత కొన్ని వారాలు గడిచాయి, "ఎడారిలో ఒయాశిసులా తలచిన" నా ఇనటర్వ్యూ ఎటువంటి ఆఫర్ ఇవ్వకపోవటంతో ఇక అదికేవలం "ఎండమావి" అనుకుని నీళ్ళొదిలేసా!!

అలా అది జరిగిన కొన్నాళ్ళకే ఎప్పుడో దరకాస్థు చేసిన మా ఫ్రెండు వాళ్ళ కంపెనీ నుండీ ఒక కాల్ వచ్హింది తరువత రొజే రాత పరీక్షకి రావలని; మళ్ళీ అమృతంపై ఆశలు చిగురించాయి, వెంటనే నాతో పాటు ఉద్యోగప్రయత్నం చేస్తున్న మిగిలిన స్నేహితులల్కి కూడా పరీక్షకి తయ్యరు అవ్వలని చెప్పాను.మరుసటిరోజు అందరం కలిసి "నెస్స్"(Ness) కంపెనీ కి చేరుకున్నాం, కాని అక్కడి పరిస్తితి కేవలం కాల్ లెటరు ఉన్న వారినే అనుమతిస్తున్నారు అని తెలియటంతో మా అందరి తెలివి తేటలూ చూపించి సెక్యూరిటీ కళ్ళు గప్పి మొత్తానికి అందరం కలిసే లోపలికి ప్రవేసించాము. పరీక్షకి తయారు అయ్యాము, కానీ ఇలాంటివి అప్పటికే చాలా సార్లు చూసిన ఆ కంపెనీ HR లు సులువుగా కాల్ లేటరు లేని నా స్నేహితులని గుర్తించేసారు. కానీ పరీక్షలో ఎక్కువ మార్కులు రావటంతో మా రిక్వస్ట్‌ని గుర్తించి మిగిలిన రౌండ్లకి అనుమతించారు, ఆ రోజు మాతో పరీక్షలు రాసిన మొత్తం 58 మందిలో చాలా రౌండ్లు నేనూ నా స్నేహితులు దాటగలిగాము. కానీ ఒక స్నేహితుడు మద్య రౌండులో వైదొలగాడు. మొత్తనికి ఆ 58 మందిలో అఖరుకి సెలెక్ట్ అయిన ఇద్దరూ నేనూ నా మిత్రుడే!నిజానికి అక్కడ జరిగిన ఇంటర్వ్యూలలో మా విజయానికి కారణం అయిన మా మిత్రులు(అదే కంపెనీలో పనిచేసే వాళ్ళు) మాకు నిజంగా ఎంతో నైతిక ధైర్యం ఇచ్హారనే చెప్పాలి.

అఖరి రౌండ్ అయిన తర్వాత నన్ను మేనెజరు ఒక సారి చూడాలని కోరారనీ, ఆయన ఊళ్ళో లేని కారణంగా 2 రోజులు ఎదురుచూడాలని కోరటంతో మళ్ళీ నిరాశతో ఇంటికి వచ్హేసా ! ఇంక ఇది కూడా "ఎండ మావే" అని తలిచా!!! కూర్చున్నా, పడుకునా; పోరాడినా ఆ కంపెనీ ప్రాగణం, ఇంటర్వ్యూలో చాకచక్యం గా ఇచ్హిన జవాబులే బాగా వెంటాడ సాగాయి. అయినా రోజూ AC లో తిరిగే ఆ మేనేజరు "ఎండకి ఎండీ, వడదెబ్బకి వాడిపొయిన" నా మొహం ఎమి చూస్తాడబ్బా , ఇదంతా కేవలం కల్లబొల్లి కబుర్లే అని అనుకుని ఇక మన బతుకు ఇంతే అని వదిలేసా. మళ్ళీ అదే కంపెనీ నుండీ కాల్ వచ్హింది - మరుసటి రోజు రావాలని; ఆ రోజు "ఉగాది" (March 31 2006)పండుగ. తీరా వెల్లగానే నాకు ఒక నామమాత్రపు ఇంటర్వ్యు నిర్వహించి ఆఫర్ లెటరు చేతిలో పెట్టారు. దానితో నాకు 2006 ఉగాది పండగా కేవలం తీపి రుచిని మాత్రమే ఇచ్హింది.ఆ తీపిని స్నేహితులతో పంచుకునేందుకు అష్ట-కష్టాలు పడీ ఆ రాత్రి రూం కి చేరాను.

ఆ విధంగా సిలికాన్ సిటీలో సెర్చింగ్ నాకు ఉద్యాన నగరిని చిరస్మరణీయం చేస్తూ నా జీవతాన్నీ ఉగాది రోజునే ఉపాధి చూపిస్తూ పూలు చల్లిందనే చెప్పాలి.ఆ రోజు వేసిన తొలి అడుగూ నన్ను సప్త సముద్రాలని కాకపొయినా కొన్ని సముద్రాలని అయినా సునాయసంగా దాటిస్తూ అమెరికాయానం చేయించింది. ఆఫీసులో నేర్చిన పలు విషయాలూ , ఇంకా నా అమెరికా ముచ్హట్లతో తదుపరి టపాలో దర్శనమిస్తా!!!

ఉద్యోగపర్వం
అమాయకంగా అమెరికాయానం...(ఉద్యోగపర్వం - చతుర్దాశ్వాసం )
మాంద్యం దెబ్బ - మరో జాబ్ దొరికిందబ్బా !! (ఉద్యోగపర్వం - పంచమశ్వాసం) * Coming soon *

Monday, July 20, 2009

హైదరాబాద్ లో హంటింగ్ (ఉద్యోగపర్వం - ద్వితియాశ్వాసం)

హైదరాబాద్ లో హంటింగ్ (ఉద్యోగపర్వం - ద్వితియాశ్వాసం)
కాలేజిలో కటింగ్ ఇచ్హిన పాపానికి ... ఆడ్రస్సు సరిగా రాయకపోతే మనం రాసిన ఉత్తరం మనకే వచ్హినట్టు; మొత్తానికి కాలేజీ ముగుసిన తర్వాత మళ్ళీ నా స్వగ్రుహానికే నా దారి; రహదారిన పడింది. ఇంటికి వెళ్ళిన నాకు అమ్మ వండింది తినటం, టీవీలో వచ్హే సినిమాలు చూడటమే తప్ప అసలు నా జీవితంలో ఎమి జరుగుతుందో తెలిసుకునే తీరికే లేదు.ఎందుకో తెలీదు కలిసిమెలిసి తిరిగిన ఫ్రెండ్స్ గురించి అయినా ఆలోచనే లేదు, ఎందుకని ఒక్కసారిగా నా బ్రెయిన్ అంతగా బ్లాంక్ అయిందో తెలియదు . బహుశా నాలుగేళ్ళు కాలేజీలో ఎదో పొడిచేసానని పొగరేమో !! అదేంటో, అప్పటి నా అంతరంగాన్ని ఇప్పటికీ అన్వేషిస్తూనే ఉన్నా.

మొత్తానికి ఒకరోజు మా బాబాయి ఇంటికి వచ్హి చేతికి ఈనాడు పేపరు ఇచ్హి అందులో మా ఊళ్ళోనే ఒక ఇంజరీరింగ్ కాలేజిలో లెక్చరర్ పోస్టులు పడ్డాయి, ఇంటర్వ్యూ కి వెళ్ళు అని పక్క గదిలో ఉన్న మా అమ్మ-నాన్నలకి వినపడేలాగాచెప్పాడు. నో చెప్పటానికి రీసన్ అలోచిస్తుండగా ఎదో నన్ను యెస్ అనిపించింది అదే ..కొంచం ఆలొచిస్తే గతంలో మా లెక్చరర్లు కాలేజిలో చేసిన కామెడీలు గుర్తుకువచ్హాయి. ఆ కామెడి నాకు అనందాన్ని ఇచ్హిందో లేదో గాని నాలో నాకు తెలియని బోలెడంత దైర్యాన్ని ఇచ్హింది, దానికి కారణం ఎన్నో తప్పులు కుప్పలు తెప్పలుగా చెప్పే కొంతమంది లెక్చరర్లని చూడటమూ, ఆ చిరాకులో ప్రతీ సబ్జక్ట్ లోని ముఖ్యమయిన టాపిక్ నీ ఎంతో కష్టపడి బాగా నేర్చుకున్న స్థైర్యం, ఇంకా అన్నిటికన్నా అంత కష్టపడి నేర్చిన మెళుకువలు కేవలం నా మార్కుల చిట్టాలకి బరువు పెంచటమే కాకుండా పాపం సబ్జక్ట్ అర్ధంకాక ఒకే సబ్జక్ట్ పై గజిని దండయాత్రలు చేసే నా మిత్రులకు కూడా నేర్పాడానికి, వాళ్ళు పాస్ అవ్వటానికి దోహదం చేసింది అని చెప్పటంలో నాకు ఎంతో అన్నందం ఉంది. ఇవ్వన్నీ కలిపి నన్ను సి.ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్ పోస్ట్ ఇంటర్వ్యూ కి తీసుకెళ్ళగా, వచ్హిన 36 మందిలో నేను సెలక్ట్ అయ్యానన్ని సాయంత్రానికే తెలవటం భలే ఆనందం వేసింది . అనందంలో నాకు ఒక రాత్రి నిద్ర కరువయితె అయ్యింది కాని నాగురించి నేను ఆలోచించుకునే అవకాశం దొరికింది.

తెల్లవారుజామున నిద్ర లేవటంతోనే నాలో ఎదో తెలియని ఉత్సాహం, గుడికి వెళ్ళివచ్హిన నాకు అమ్మ టిఫిన్ పెడుతూ అడిగింది. "కాలేజిలో ఎప్పుడు జాయిన్ అవ్వాలి ?" అలోచించకుండా అమ్మకి కటువుగానే చెప్పేసా "నేను హైదరాబాద్ వెళుతున్నా" అని.మద్యాహ్నం వరకూ ఓపిక పట్టిన అమ్మ భొజనం పెడుతూ నాన్నగారికి నెమ్మదిగా చెప్ప సాగింది. ఇక్కడే ఉంటే ఇంటిపట్టున ఉండొచ్హు అని చెప్పండి మీరయినా అంది. నాన్న ఎమీ మాట్లడలేదు. హైదరాబాద్ కి ఒక బస్ కి టికెట్ట్ తీసి తెచ్హారు ఆ సాయంత్రం, రెండురోజుల్లో ప్రయాణం, అమ్మ మా అన్నయ వాళ్ళకి ఫోన్ చేసి అక్కడికి వెల్లమంది. నాకు అక్కడికి వెల్లటం సస్యేమిరా ఇష్టం లేక హైదరాబాదులోనే ఉంటున్నాడు అని తెలిసిన ఒక స్నేహితుడికి ఫోన్ చేయగా ఎమీ తడ పడకుండా వాళ్ళ రూంలో ఉండేందుకు సమ్మతించాడు. ఆ రోజు రానే వచ్హింది ; బస్ ఎక్కిన నాకు అలోచనల అలలు కునుకు పట్టనివ్వలేదు.ఉదయానే హైదరాబదులో దిగిన నేను స్నేహితుని సాయన వాళ్ళ రూం కి చేరాను.అక్కడ మొదలు అయ్యింది నేను, నేను లా బ్రతకటం...

కూకట్ పల్లిలో అదొక పెద్ద ఇల్లు (3 అంతస్తుల బంగళా) కాని అందులో మేము ఉండేది చిన్న పోర్షన్, ఉన్న ఒక్క గదిలోనే నాతో కలిపి అప్పటికే అయిదుగురు, తనకే లేదు మొర్రో అంటే తనకి ఒక డోలు అన్నట్టు నా పుస్తకాలూ, బట్టలు.ఇలా అందరి పుస్తకాలూ బట్టలతోనే రూం సగం నిండి పోయేది.అయినాగని ఆ పుస్తకాల మద్యనే తింటూ, పడుకుంటూ ఉండే అద్రుష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి. అది అసలే వేసవి కాలం కావటం తో అక్కడ నీళ్ళకి భలే యెద్దడి ఉండేది. అప్పటికే నీళ్ళ కోసం తగిన ఏర్పాట్లు చేస్తూ మా వాళ్ళు పెద్ద డ్రమ్ము ఒకటి కొన్నారు, తెల్లవారుజామున కులాయి వదలగానే దాన్ని నింపుకోకపోతే ఆ రోజుకి పాలు తాగిపడుకోవాల్సిందే ఎందుకంటే నీళ్ళుండవు కాబట్టి. అప్పట్లో అసలు నీళ్ళు కొనుకుని కూడా తాగొచ్హు అన్న ఆలోచనే రానంత జాగర్త మాకు డబ్బుల పట్ల. ఇంజరీంగ్ చదువుకునే రోజుల్లూ రాత్రంతా మెల్కువ ఉండి చదవటం అలవాటు అయిన మాకు తెల్లవారు జామున నిద్ర లేవటం అంటే బహుకష్టంగా ఉండేది, మా అద్రుష్టం కొద్ది మా స్నేహితుడు ఒకడికి ఈ పాడు అలవాటు లేదు. వాడే మా అందరికి కాస్తంత పడుకునే భాగ్యం కలిగించేవడు. వాడు మా అందరికి చాల స్పెషల్. మేము అంతా చదువుకునే సమయంలో(ఆ పేరుతో హైదరాబాదు క్షేమ సమాచారాని సమీక్షించెవాళ్ళం) పడుకునేవాడు. మేము పడుకోగానే నిద్రలేచి చదువుకునే వాడు, బహుశా అప్పటికే కాలం విలువ తెలిసిరావటమే వాడి అద్రుష్టం కామోలు.

ఎన్నో నేర్పారు మా స్నేహితులు, అప్పటివరకు మా నాన్న చెప్పిన కంప్యూటెర్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ చెంజ్ అంటే naukari వెబ్ సైట్ అని తెలియని స్తితిలోనే ఉన్నాను అనుకుంట. రోజూ ఇంగ్లీషు వార్తాపత్రికల్లో పడే జాబ్ లకు మాత్రం ఎ-మెయిలు పంపే నేను నౌకరీ కి మారాను.అతి కొద్దికాలంలోనే అలాంటి సైటులనంటిలోనూ సభ్యత్వం నమోదు చేసుకున్నా.బస్ పాస్ తీసుకొవటం దగ్గర నుండీ ఇంటర్వ్యూ లో బుర్ర ఎలా వాడాలో వరకూ ఇలా ఎన్నో తెలిసాయి.

ఉదయానే రూం దగ్గరలో బండి దగ్గర ఇడ్లీలూ లేదా దోశలు తిన్నాక అయిదు రూపాయలిచ్హి ఇంటెర్నెట్ కి వెళ్ళెవాల్లం. ఇంటెర్నెట్లో వేట, అన్ని కంపెనీల వెబ్సైటులలొ "నేనొక నిరుద్యోగ అభాగ్యుడిని బాబూ నాకొక జాబ్ ఇవ్వండీ " అంటూ దరకాస్తు చేసేవాళ్ళ్ళం.ఎవరయినా ఫ్రెండ్ పలానా ప్లేసులో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి అని ఒక్క SMS పంపితే చాలూ క్షణాల్లో పది మందికి తక్కువ కాకుండా గుంపుగా ఆ కంపెనీ గేటు పై దాడి చేసేవాల్లం, వచ్హిన యువజన సంద్రాన్ని కొన్ని కొన్ని సందర్భాల్లొ గేట్లు సైతం ఆపలేకపొయేవి. మా గోల భరించలేక గేటు మాన్ కి మా రెస్యూం ఇచ్హి వెల్లమని చెప్పెవాల్లు . మరుసటి రోజు అదే కంపెనీ దగ్గరలో బజ్జీలు తింటే తెలిసేది ఆ సెక్యురిటీ వాడు మా రెస్యూంలు అమ్మెసాడు అని.

పాపం వాడికి ఎమి తెలుసు అది కేవలం మా గోల మాత్రమే అనుకున్నడేమో !! అవి మా ముందు జీవితపు మైలు రాళ్ళు అని తెలిస్తే వాటిని చేరవలిసిన దగ్గరకే చేర్చి ఉండే వాడు.అటూ ఇటూ తిరిగి వచ్హినా మా అందరిని కలిపేది మట్టికీ ఒక్కటే ఉండేది అదే అకలి అనుకుంట. అందుకే అందరం కలిసి ఒకే పార్సెల్ బోజనం పంచుకునే వాళ్ళం.ఇక ఇది ఇలా ఉండగా రాత్రి పూట మాత్రం ఒక అరటిపండు మంచి బోజనం అని చెప్పాలి. అప్పటివరకు నాకు అరటిపండు అంటే మా ఊళ్ళో దొరికే చిన్నపాటి పసుపు రంగువి మాత్రమే తెలుసు.కానీ మొట్టమొదట హైదరబాదులో చూసిన ఆ పెద్ద పచ్హని అరటిపండు ఇంచు మించి రాత్రి పూట విందులా మంచి అమృతంలా ఉండేది.
ఇక రాత్రి కి మాత్రం మేము రోజూ తూచా తప్పకుండా కొంతమంది స్పెషల్ ఫ్రెండ్స్ తో గడిపేవాళ్ళం అవి మరి ఎవరో కాధు "కూకట్ పల్లి దోమలు". ఇవి నా ఉద్యోగపర్వంలో ఎంత సహాయం చేసాయి అంటే ఒక్క పూట కూడా నా లక్ష్యాన్ని మరచిపోకుండా కంటి మీద కునుకు పడనీయకుండా తట్టి లేపుతూనే ఉండేవి. వీటి పుణ్యమా అని రాత్రంతా అటూ ఇటూ రోడ్లు అవి సరిగా ఉన్నాయో లెదో సర్వే చెసేసి (తెల్లారితే సి.ఎం కి నివేదిక పంపాలన్నంత భాద్యత గా) తెల్లవారుజామున ఎప్పుడో మొత్తానికి మా స్పెషల్ స్నేహితుల సంగీత విభావరిలో; రూంలో మిగిలి ఉన్న జాగాలోనే ఎవరో ఒకరి కాళ్ళ కింద పడుకుని నా కాళ్ళు ఇంకొకరి తల ముందు పార్కు చేసుకునెవాళ్ళం.

ఇది ఇలా ఉండగా ఆ శోధన సమయమంతా కూడా మాకు మేమె మార్గదర్శకులం- అమ్మ, నాన్న , అక్క , బంధువులు ఎవ్వరూ వద్దు మాకు మేమే దిశా నిర్డేశం అన్న ధీమా !! ఇంటి దగ్గర నుండీ ఫోన్ వచ్హిందంటే మాట్లాడాలంటే భయం. ఎందుకో తెలీదు 21 యేల్లు అడిగినదల్లా ఇచ్హి మా అనందంకోసం వాళ్ళ ఆనందాన్ని సైతం తాకట్టు పెట్టినా కూడా. బహుశా అంతే ప్రేమతో ఇక వాళ్ళు జీవితాంతం మనకోసమే బ్రతుకాల్సివస్తుందేమో అన్న భయమెమో ? వాళ్ళు ఫోన్ చేసినా కేవలం మన బాగోగుల కోసం తపిస్తున్న మాటలే వినపడతాయనేమో ?. మనకోసం ఎవరో ఎదో చేస్తారు అని - ఫలానా వాల్లని కలువు ఈ ఫలానా వాళ్ళని పిలువు అన్నమాటలు వినటం ఇష్టం లేక కొన్నాళ్ళు అసలు ఫోన్ లో మాట్లాడటమే మానేసా. అదలా ఉండగా కంప్యూటర్ ముందు కళ్ళప్పగించుకు చూస్తూ చేసే జాబ్ కి తప్ప వెరే జాబ్ కి మేము ఫిట్ కాదు అని తెలియకేమో అప్పుడప్పుడూ వచ్హే ప్రభుత్వోద్యోగాలకి సైతం కొందరు దరకాస్తు చేసేవాళ్ళు.

ఇదిలా ఉండగా అక్క ఇచ్హిన మూడువేలూ అయిపొయే స్థితి మొదలయ్యింది, దానితో ఎమి చేయాలో తెలియని సందిగ్దం, అప్పుడే ఒక స్నేహితుడు మంచి (మొదటి) అవకాశం ఇచ్హాడు,అదే సిస్టం ఇన్స్టలేషన్ & కాన్ ఫిగరేషన్ పని. మా స్నేహితుడు ఒకడు దుబాయ్ వెల్లబోయే ఒక వ్యక్తికి (.NET) వాళ్ళ ఇంటివద్దనే (Home Tuition) నేర్పేవాడు. వాళ్ళకి ఇన్స్టలేషన్ & కాన్ ఫిగరేషన్ చేస్తే ఎంతో కొంత ఇస్తారనటంతో అందె వచ్హిన అవకాశాన్ని అందిబుచ్హుకున్నా! అదే బహుసా నా మొదటి సంపాదనేమో ! అది అనిమిది వందల రూపాయలు అని గుర్తు. ఒకానోక రోజు కూకట్ పల్లి లో నన్ను చూసిన మా అన్నయ( cousin) ఎక్కడ ఉంటున్నావ్ అని అడగటంతో రూం చూపించక తప్పలేదు. కాని విస్తు పోయిన తను నన్ను ఆలోచించుకునే సమయం లేకుండానే తీసుకెళ్ళి తన రూంలో దింపాడు. ఎదో భంధం .... భలే బాధనిపించింది !

ఆ తర్వాత ఏమి చెయాలో తోచక కాళీ గా కూర్చోలేక మా అన్నయ వాళ్ళ నెట్2ఫోన్ షాపులో పని చెయటం తెలుసుకున్నా అది చాలా తేలికయిన పనే, వచ్హే కస్టమర్లకి వాళ్ళకి కావల్సిన దేశానికి ఫోనులు కలపటం. కేవలం ఏ లయిను ఏ దేశానికో తెలుసుకుని సరిగ్గా కనెక్ట్ చెయటమే ! ఇది ఇలా ఉండగా అవసరాన్ని బట్టీ కొంత సేపు సిస్టం లు సెర్వీస్ చెయటం మరి కొంత సేపు ఇంటెర్నెట్ సెంటర్లో పనిచేయటం(అవన్నీ మా అన్నయ్య షాపులే ) ;ఎదంటే అది కాళీగా ఉండకుండా చేసేవాడిని. అది నిజంగా బిజినెస్ పట్ల నాకు ఒక అవగాహన నేర్పింది అని చెప్పాలి.ఇవ్వన్నీ ఇలా ఉంటే మరో పక్క జాబ్ ప్రయత్నాలు వదలలేదు.


అప్పుడే నా స్నేహితుడు ఒకడు తను చెపుతున్న టూషన్ (Home Tuition) మద్యలో మానాల్సి రావటంతో ఆ అవకాశం నన్ను తీసుకోమని చెప్పాడు.మరో ఆలోచన లేకుండా తన పని కొనసాగించా! వీటన్నిటికీ కారణం కేవలం ఇంటి నుండీ వచ్హాక డబ్బుకోసం ఎట్టిపరిస్తితుల్లోనూ అమ్మ - నాన్నలపై ఆధారపడకూదదు అన్న ధ్రుడమయిన సంకల్పం మాత్రమే .అదలా ఉండగా అత్యంత హంగామ చేస్తూ టీ.వీలో భారీ పబ్లిసిటీ తో వచ్హిన జాబ్ ఫేయిర్ రానే వచ్హింది. అది నిర్వహించిన హైటెక్స్ గ్రౌండ్స్ ఇప్పటికీ కల్లలోనే మెదులుతూ ఉంటుంది. అంత అద్బుతమయిన కట్టడాలని నిజంగా నా కళ్ళతో చూడటం బహుశా అదే మొదటీసారి అనుకుంట ! కానీ అక్కడ నిర్వహించిన సెలక్షన్ ప్రోసెస్ లో వచ్హిన ఆఫర్ కి ఆఫర్ లెటర్ మాత్రం ఇంత వరకు నన్ను చేరలేదు.అదే ఆ జాబ్ ఫెయిర్ కి కొసమెరుపు .

అసలు కధ మలుపు తీరిగింది మాత్రం నేను ఆల్-హబీబ్ అనే ఒక ఇంజనీరిగ్ కాలేజిలో లెక్చరర్ గా చేరిన తర్వాత మాత్రమే! నాకు ఆ రోజు జరిగిన సెలక్షన్ ప్రాసెస్ ఇప్పటికీ గుర్తే ! ఎంతో మంది అనుభవం ఉన్న అధ్యాపకులు ఉద్యొగానికి వచ్హిన శర్మ అనే ఆ కాలేజి ప్రిన్సిపాల్ మాత్రం నా బోధనా విధానం నచ్హిందని నన్ను సెలక్ట్ చేసారు.చెసేది ఎమీ లేక ముందు ఉన్న అవకాశాన్ని వదలలేక జాయిన్ అవ్వటానికి అంఘీకరించా !! ఇక అక్కడ ప్రయాణం ఇంచుమించు ఒక ఆరు నెలలు పైననే జరిగింది, ఈ అనుభవం నిజంగా నా ఇంజనీరింగ్ కోర్ సబ్జక్ట్లన్నీ మళ్ళీ జ్ఞప్తికి తెచ్హింది.ఒక పక్క ఇక్కడ చెపుతూనే అమెరికాకి అంభవజ్ఞులయిన అద్బుతమయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లని తయారు చేసి అందించిన అమీర్ పేట లోనే (MS SQL server ) నేర్చుకునే వాడిని .ఇలాఉంటూనే అదే కాలేజిలో పడిన కొత్తపోస్టులకి నా ఫ్రెండ్స్ ని రెకమెండ్ చేసె వాడిని, వాళ్ళలో కొందరు నాతో అక్కడే పని చేయటం నిజంగా నాకు బలే అరుదయిన ఆనందాన్ని మిగిల్చింది.

అమీర్ పేట నిజంగా మా పాలిట మరో కల్ప తరువు అనే చెప్పాలి ఎందుకంటే ఈ చెట్టు కింద నీడ మాకు మా పాత స్నేహితులని ఎంతో మందిని కలిపేది, ఈ తరువే మాకు భోలెడంత జ్ఞానాన్ని ఇచ్హేది.ఆశ్చర్యంగా మేము అంతా కలిసే ప్లేసు పేరు కూడా "మైత్రీ వనం" ఇక్కడ కలిసినప్పుడు మేము ఎంత కలత చెంది ఉన్న సరే ఇట్టే మనసు పులకరించేది. అదే కాలేజిలో సెమిస్టర్ ముగియగానే ప్రిన్సిపాల్ నన్ను కాలీ గా ఉంచటం ఇష్టంలేక తనకి పెర్సనల్ సెక్రెటరీ గా ఉంచుకుని తన కూడా ప్రతీ ముఖ్యమయిన పనికి తిప్పుకునే వాడు. కొన్నాళ్ళకి ప్లేస్మెంట్ వ్యవహారాలు అప్పగించాడు. కానీ ఎప్పటి నుండో కంప్యూటర్ భాషలలో నాకున్న పట్టుని గమనించిన సహొద్యోగులు, ఇంకా నాకు బాగా కావల్సిన ఫ్రెండ్స్ కొందరు పట్టు పట్టి నన్ను ఆ ఉద్యోగం మానాల్సిందిగా బలవంతం చేసి నాకు కొత్త మార్గం అవసరం అని బల్ల గుద్ది చెప్పారు. అంతమంది శ్రేయోభిలాషుల ఆశీశులు నన్ను సునాయాసంగానే కొత్త గాలికై వెతికెట్టు చేసాయి.

అప్పటికే బెంగుళూరులో ఒకరొకరుగా స్థిరపడుతున్న ఆప్తమిత్రులు కొందరు "నాకు అప్పటికే చాలా ఆలస్యం అయ్యిందనీ అయినా అక్కడ ప్రయత్నం మంచిదని" నన్ను అప్రయత్నంగానే అక్కడికి రప్పించారు !!! ఆ విధంగా హైదరా బాదులో హంటింగ్ కి ఒక ఫుల్ స్టాప్ పెట్టి బెంగుళూరు మహానగరానికి ఒక రైలు టికెట్టు కొన్నాను.

ఈ విధంగా అప్పటివరకూ
పులిహోరలో పులుపు మాత్రమే తెలిసిన నాకు ... భావార్చి లో బిర్యాని ఘుమఘుమగలు చూపింది మన భాగ్యనగరం.
జీవితంలో కష్టాలని ఎంత సులువుగా అదిగమించొచ్హో నేర్చింది ఇక్కడే ! కళ్ళ ముందు ఉన్న అవకాశం విలువ వదలక ముందే తెలుసుకున్న నేను నిజంగా అద్రుష్టవంతున్నే కాక ఆలస్యించిన ఆశా బంఘం అన్న అర్దాన్ని అవలీలగా అర్దం చేసుకున్నా అనుకుంటా !!
ఉద్యోగపర్వం
అమాయకంగా అమెరికాయానం...(ఉద్యోగపర్వం - చతుర్దాశ్వాసం )
మాంద్యం దెబ్బ - మరో జాబ్ దొరికిందబ్బా !! (ఉద్యోగపర్వం - పంచమశ్వాసం) * Coming soon *

P.S : ఈ టపా రాస్తున్నంత సేపూ మదిలో మెదిలిన మరెన్నో మదురానుభూతులని ఇక్కడ అసందర్భోచితంగా తోచి కేవలం నా మదిలోనే ఉంచుకున్నాను.కనీసం కుదిరితే మరొక ప్రత్యేక టపాలో పొందుపరచగలను.


Wednesday, July 15, 2009

కాలేజిలో కటింగ్ - ఉద్యోగపర్వం ప్రధమాశ్వాసం

కాలేజిలో కటింగ్ (ఉద్యోగపర్వం - ప్రధమాశ్వాసం )
అది జూలై 14 2009, నేను కాంఫరెన్స్ కాల్ లో కౌలాలంపూర్(మలేశియా దేశంలో ముఖ్యపట్టణం) లోని కొత్త టీంకి కే టి ఇస్తుండగా ఫ్రెండ్ దగ్గరినుండీ మొబైల్ కాల్ వచ్హింది, ఎమి చేయాలో తెలియక కంగారులో కట్ చేసేసా. అర్దంకాని మలై స్లాంగ్ తో ఆ కొత్తటీం వాళ్ళు అడిగే అమాయకపు అర్దరహిత ప్రశ్నలకి సూటిగా పదునయిన అర్దసహిత సమదానాలు ఆపకుండా అరగంటకి పైగానే చెప్పేసరికి నాకు కాస్త తలపైన కొమ్ములు మొలిచినంత భారంగా అనిపించింది. కట్ చేస్తే ఫ్రెండ్స్ తో టెర్రస్ లో కాఫీ తాగుతున్న నాకు అంతకుముందు మా ఫ్రెండ్ కాల్ చేసిన సంగతి జ్ఞాపకం వచ్హింది. వెంటనే కాల్ చెస్తే ఏరా? ఇందాక బిజీ నా కట్ చెసావ్ అన్నాడు. ఎమి చెప్పాలో తోచక అలా అలోచిస్తున్న నాకు ఎమీ జాబ్ సేర్చో గాని బాబాయ్ వాసిపోతుంది అన్నాడు. ఎరా ?? అని ఎదో ఆలొచిస్తూ అడిగా !! ఎముంది రా మొన్న IBM లో ఇంటర్వ్యూ అంటే కొత్త చొక్కాయి కొనుక్కుని కంగారుగా వెల్లాను రా; తీరా అక్కడ నాలా కొత్తచొక్కాయి కొనుకున్న ఫేక్ ఫేసులు "రెస్యూం వేస్తే రాలనంత మంది ఉన్నారు" అన్నాడు. వాడి మాటల్లో ఎదో తెలియని భయం, ఆందోళన ఇంకా విసుగు నాకూ ప్రస్పుటం గా అర్దం అయ్యింది. వెంటనే ఇప్పుడు ధైర్యం చెప్పకపోతే మళ్ళీ ఇంటర్వ్యూ కి వెళ్ళడేమో అన్న భయంతో నేను ఎదో ధైర్యం చెప్ప సాగాను; నీకే రా కంఫర్టబిల్ కా కంప్యూటర్ ముందు కూర్చుని ఎన్నయినా చెపుతావ్ మాకు ఇక్కడ మడతడిపోతుంది అన్నాడు. ఇంక ఆపుకోలేని నా ఆవేదనంతా ఒక్కసారి గతంగా గిర్రున తిరిగింది; ఆ ఆలోచనలు ఆందోళనగా నన్ను అక్కడినుండీ ఎక్కడికో తీసుకెళ్ళాయి... ఆ అలోచనా తరంగాలే ఇక్కడ టపా గా మీ ముందు ఉంచుతున్నా.

మార్చి 2005: కొత్తగా ముస్తాబయిన మా ఇంజనీరింగ్ కాలేజి క్యాంపస్ కి కొత్త జీన్స్ వేసుకుని ఆఖరి సెమిస్టర్ అన్న ఆనందంతో అడుగు పెట్టాము. సెమిస్టరు హాలిడేస్ లో చూసిన హాలివుడ్ సినిమాల గురించి సిల్లీగా సమీక్షిస్తున్న మాకు మా గ్రహంగాడు (ఒక ఫ్రెండ్ ముద్దు పేరు) అర్దం పర్దం లేకుండా "రెజ్యుం చేసానురా నేను అన్నాడు". రెస్యూం చూసావా ?? చేసావా మామా ?? ఎవరి సినిమా మామా అది యాక్షన్ సినిమాన లేక మసాలా సినిమా నా అని అమాయకం అడిగాడొకడు. అక్కడ మొదలయిన ఆ ప్రశ్న మాలో చాలా మందికి ఒక ఆఫర్ లెటర్ చేతికి వచ్హేవరకూ వెంటాడుతూనే ఉంది. ఇది ఇలా ఉండగానే ఆ సెమిస్టర్ సిలబస్సే తెలియని మాకు; "సత్యం క్యాంపస్ సెలక్షన్లు " అని మా ఊగుడు ప్రిన్సిపాల్ నోటీస్ పంపిచాడు. మాదే మొదటి బ్యాచ్ కావటంతో మా లాంటి కాలీజి వాల్లంతా వైజాగ్ రావల్సిందిగా, అసక్తి కలవారు EDP సార్ కి పేర్లు నమోదు చెయించుకోవలిసిందిగా అందులో ఉంది. అప్పుడే మూడు నెలలు వైజాగ్లో ఉండి పోర్టులో ప్రాజెక్ట్ చేసివచ్హిన నాకు, వైజాగు పై మోజు తీర్చేందుకే వచ్హిన సదావకాసంగా భావించి స్నేహితులంతా కలిసి ఒక మంచి ట్రిప్పులా అయినా ఎంజాయ్ చెయాలని తలంచి వెల్లటానికి తయారయ్యాం.

అసలు సెలక్షన్ ప్రొసెస్ పైన ఎటువంటి అవగాహనా లేని నేను ఎదో ఒక సింపుల్ ఎక్సాంలాగా ఫీల్ అయ్యి ఎక్సాం రాసెసి ఫ్రెండ్స్ నంతా తీసుకుని బీచ్ కి బయలుదేరి ఆడుకుంటున్న నాకు నా స్నేహితుడు ఒకడు నేను ఉదయం రాసిన పరీక్షలో క్వాలిఫైనట్టు నాకు వెంటనే రెండో రౌండ్ పరీక్ష ఉన్నట్టూ హుటాహుటీనా రమ్మన్ని నా మొబయిల్ కి కాల్ చేసాడు. ఇంకేముంది తడిసినబట్టలతో తింటున్న మొక్కజొన్న కండి అక్కడే పడేసి మా ఫ్రెండ్ వాళ్ళ మావయ్య దగ్గరనుండీ తెచ్హిన్న కొత్త డిస్క్ బ్రేక్ పల్సర్ మీద పైడా కాలేజి ప్రాంగణానికి కాస్త ఆలస్యంగానే చేరుకున్నా.ఇంక చెప్పటానికి ఎముంది మనిషి ఒక దగ్గర మసు ఒక దగ్గర ఉన్న నేను ఆ పరీక్ష డింకీ కొట్టాను. దాని గురించీ చీమ అంత అయినా చింత లేకుండా వైజాగ్ బీచ్ మదురానుబూతులతో కాలేజి కి చేరుకున్నాం.

సత్యం దెబ్బ నొప్పి తెలియకపోవటంతో వెంటనే వరంగల్లు వెల్లి రాసిన ఇంఫోటెక్ ఎక్సాం కూడా కేవలం ఒక యాత్ర లాగానే మిగిలింది. అక్కడ జరిగిన ఆన్ లైన్ ఎక్సాం లో అవకతవకలు కేవలం ఆ కాలేజి వాల్లకి మాత్రమే ఉద్యోగం తెచ్హి పెట్టగలిగాయి.మాకు ఓరుగల్లు కోట మాత్రం "వర్షం సినిమాలో మెల్లగా తరగని .." అంత అందమయిన అనుభూతుల్ని మిగిల్చింది. ఆ పై అఖరి సంవత్సరం ప్రాజెక్టులు, ఫెయిర్వెల్ పార్టీలు, పరీక్షలతో చాల హాడావిడి గా కాలేజీ రోజులు ముగిసిపొయాయి. బాగా తెలిసిన బాధ (స్నేహితులంతా విడిపోతున్నామని) ఒక పక్కా, ఎదో తెలియని ఆనందం (ఈ చదువుల భారం ఇక దిగిపొయంది అని) మరో పక్కనా ఉంటే అసలు ముందు భవిష్యత్తు ఎమిటో అగమ్యంగా ముందుకి నడిచాను.

మొత్తానికి తెలిసీ తెలియని నా ఉద్యోగపర్వం ఇలా కాలీజీలో కధం తొక్కింది. ఉద్యోగపర్వం లోని ప్రధమాశ్వాసం - "కాలేజిలో కటింగ్" అనే అంకం సమాప్తం, ఉద్యోగపర్వం లోని ద్వితియాశ్వాసం - "హైదరాబాద్ లో హంటింగ్" అనే తదుపరి అంకంతో త్వరలోనే దర్శనమిస్తాను.
P.S :
అన్నట్టు ఉద్యోగపర్వంలో ప్రధమాశ్వాసం అన్నానని ఇదేదో "మహా భారతం" లో "ఉద్యోగపర్వంలో" "ప్రధమాశ్వాసం" అని అనుకొకండి ...ఇది కేవలం నా "భారతంలోనిది" మాత్రమే సుమా !

ఉద్యోగపర్వం
సిలికాన్ సిటీ లో సెర్చింగ్ (ఉద్యోగపర్వం - త్రుతియాశ్వాసం )
అమాయకంగా అమెరికాయానం..
.(ఉద్యోగపర్వం - చతుర్దాశ్వాసం )
మాంద్యం దెబ్బ - మరో జాబ్ దొరికిందబ్బా !! (ఉద్యోగపర్వం - పంచమశ్వాసం) * Coming soon *

Friday, July 3, 2009

ప్రభుత్వోద్యోగుల మీదా "హస్తం" ముద్రలు - బ్యాంక్ మేనజర్ పై మందా దాడి

ప్రభుత్వోద్యోగుల మీదా "హస్తం" ముద్రలు - బ్యాంక్ మేనజర్ పై మందా దాడి

మందా మనిషిలా ప్రవర్తించలేదు ! అంధ్రా లోని నాగరకర్నూల్ నియోజకవర్గం నుండీ MP గా ఉన్న డాక్టర్ మందా జగన్నాదం ఇటీవల మహబూనగర్ లోని అంధ్రప్రదేశ్ గ్రామీణ వికాశ్ బ్యాంక్ మానేజర్ రవీందర్ రెడ్డి చెంప పగలగొట్టిన సంఘటనలో మందా మనిషిలా ప్రవర్తించలేదు, ఇది కేవలం అతని అధికార దురహంకారం అని అనిపించింది. ఇంత చేసినా మళ్ళీ మీడీయా ముందు ఈ పెద్దాయన ఒక కాకమ్మ కధ చెపుతున్నాడు.

నా ఉద్దేశ్యంలో ఇతగాడికి కాస్త మతి భ్రమించింది ఎమో అని అనుమానం ! ఎందుకంటే చెంప కి చెయ్యి తగిలితే దాన్ని చెంప దెబ్బ అనకుండా కేవలం మాటలు మాత్రమే అంటూ చెప్పుకొస్తున్నాడు.ఇలాంటి వాళ్ళని మన రాష్త్ర MP అని చెప్పుకోవాలంటే ఈ సభ్య సమాజంలో నాలాంటివాళ్ళకి ఎంత సిగ్గుగా ఉంటుందో నేను ఊహించగలను .ఇంత వెధవ పని చేసిన పెద్దమనిషిని పార్టీ పెద్దలు మందలించక పోగా వెంకేసుకువస్తున్నారు.నాకే గనకా అధికారం ఉండి ఉంటే ఈ వ్యక్తిని వెంటనే పార్టీకీ, ప్రజలకీ కూడా దూరం చేసి ఎదోఒక మానసిక చికిత్సా కేంద్రంలో చేర్చేవాడిని.

ఆ సంఘటన టీవీలో చూసిన మరుక్షణం నాకు భలే కోపం అవేశం వచ్హేసాయి.కాసేపటికి ఇలాంటి మానసిక రుగ్మతలు ఉన్నవారిన మనం నాయకులిగా ఎన్నుకుంది అని జాలి వేసింది. ఇంతా జరిగాక మన జగన్నాదం బేషరతుగా (“Unconditional apology”) క్షమాపణ తెలుపటం అసలు నిజా నిజాలు విచారణ తర్వాత తెలుస్తాయి అని చెప్పటం నాకు మరీ వింతగా తోచింది.నోరు విప్పి పచ్హి అబద్దాలని పిచ్చిగా చెప్పేస్తున్న ఈయన దోరణికి కాంగ్రెస్ హై కామండ్ సైతం తాలం వేయటం అప్రజాస్వామ్యానికి నిదర్శనం.

మన పాలక పక్షానికి చెందిన వ్యక్తి కారణంగా విషయాన్ని పూర్తిగా బయటకి పొక్కనివ్వకుండా ముఖ్యమయిన టీవీ చానళ్ళు కి సైతం డబ్బులిచ్హి మరుసటిరోజే నోరు నొక్కే ప్రయత్నం జరిగింది.అయినా మిగిలిన దెశీచాన్నల్లు వదలకపోవటంతో విసహ్యం తేటతెల్లం అయ్యింది.ఇలాంటీ బాధ్యరాహిత్య చర్యలని ఇంకా కాంగ్రెస్ పార్టీ పెంచి పొషించటం అసమంజసం.వ్రుత్తి రిత్యా డాక్టరు అయిన మందా జగన్నధం గారు తన అరోగ్యం పట్ల అవగాహన లేకపోవటమే కాక బ్యాంకు మెనేజరు మద్యం మత్తులో ఉన్నారని కల్ల బోలి కబుర్లు చెప్తున్నారు.
"నిగ్గతీసి అడుగు ఈ సిగ్గులేని నాయకుల్ని ! అగ్గివేసి కడుగు ఈ పార్లమెంటు పెద్దలని ...."
ఇకనయినా కాంగ్రెస్ హై కామండ్ సైతం ఇతనిపై తీవ్రమైనా కఠినమైన చర్యలు చెపడితే బాగుంటుంది.
ఇదంతా చూస్తే కాంగ్రేస్ వారి "హస్తం" సీదా సాదా పేదలితొనే కాక ప్రబుత్వోద్యోగుల చంపల మీదా కూడా మరుపురాని ముద్రలనే మిగిల్చిందనిపిస్తుంది.