Sunday, July 26, 2009

సిలికాన్ సిటీ లో సెర్చింగ్ (ఉద్యోగపర్వం - త్రుతియాశ్వాసం )

సిలికాన్ సిటీ లో సెర్చింగ్ (ఉద్యోగపర్వం - త్రుతియాశ్వాసం )

సిలికాన్ సిటీలో సిల్లీగా సిందులు వేయకుండా; అప్పటికి ఉన్న ఒకే ఒక ఆశ "ఉద్యోగం" దానికోసం మాత్రమే వెతుకులాట సాగించాలనీ మొండిగా నన్ను భరిలో దింపింది మాత్రం కొందరు నా అప్తమిత్రులు అని సగర్వంగా చెప్పగలను.హైదరాబాదులో చేసిన హంటిగ్‌కి మెరుగులు దిద్దటానికా అన్నట్టు, నా జీవితపు ప్రవాహానికి సరయిన ఆనకట్ట వేసి ఖచిత్తమైన మలుపు తిప్పి దాన్ని సరయిన సర్దుబాటు చేసినవారందరికీ ఈ టపా అంకితం.

అప్పటికే నా స్నేహితులలో చాలామందికి ఉద్యోగప్రయత్నం నెరవేరడంతో, అప్పటివరకు వాళ్ళు ఉంటున్న ఒక చిన్న గదిని మాకోసం అట్టిపెట్టి వాళ్ళు అఫీసు దగ్గరలో తీసుకున్న వెరే రూంకి వెళ్ళబోతూ "అసలే ఆలస్యంగా అడుగుపెట్టావ్, ఎంతో కష్టపడితే గానీ జాబ్ రాదు" అని ఒకే ఒక్క మాట నాలో ఉన్న నమ్మకాన్ని కొంచం తగ్గిస్తూ, అవసరాన్ని సూటిగా గుర్తుచేస్తూ,మొహమాటాలకి పోకుండా అక్కడి నుండీ "ఆలస్యం అమృతం అన్నట్టు వెళ్ళిపోయారు". ఆలస్యం చేసిన నాకు అప్పుడు వాళ్ళు నిజానికి జాబ్ అనే అమృతం సేవిస్తున్న సురుల మాదిరి కనపడ్డారు.నేను అసురుడిని కాకపొయినా సూరత్వం చూపాలంటే అమృతం అస్వాదించాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నా.

అప్పుడే బెంగుళూరులో ట్రైను దిగిన నాకు, ఎదో ఆందోళనతో అదే ప్లాట్‌ఫారం మీద నాకోసం ఎదురుచూస్తూ నావైపుగా నడిచివస్తున్న నా నేస్తం కనపడ్డాడు. పాచిమొహంతోనే పైకి నవ్వాను , బరువయిన బ్యాగులతో దిగిన నాచేతిలోంచీ ఒక బ్యాగ్ తీసుకుంటూ అదరాబిదరా ఆటుగా నడువురా అంటూ మెజెస్టిక్ బస్ స్టాండ్ వైపు నడిపాడు.రెండు చేతులలో మోయలేనంత బరువున్న నేను ఆటో కోసం నడిపిస్తున్నాడు అని తలచి అమాయాకంగా "బరువుగా ఉన్నాయి" అని బాదిస్తూనే నడవసాగాను. అంత బరువుమోస్తున్న బాధలో వాడి ఆందోలణ సరిగా అర్దం కాలేదు.

మొత్తనికి చాలా చమటలు కక్కుతు ప్లాట్‌ఫారంలన్నీ దాటుతూ 22వ ప్లాట్‌ఫారంకి చేరిన నన్ను అలుపన్నా తీర్చుకోకుండానే 271 వెళ్ళిపోతుందిరా త్వరగా..త్వరగా అంటూ నా బరువయిన బోలెడంత లగేజీతో బస్ ఎక్కించాడు. ఎక్కిన తర్వాత కొంతసేపటికి ఇద్దరికీ సీటు దొరకటంతో హమ్మయ్య అనుకుంటూ .... ఎంటిరా కండక్టరు ఇందాక ఎదో "వలగడ బన్నీ" అంటున్నడు, బహుసా నా లగేజి చూసి ఎందుకు చిన్నా(=బన్నీ) అన్ని బ్యాగులు (=వలగడ) అని కన్నడాలో అడుగుతున్నడా అని అన్నాను ? వాడు పెద్దగా నవ్వలేదు గనీ "వలగడ బనీ" అంటే "లోపలకి రా" అని అర్ధంరా అనిచెప్పాడు. నా అమాయకత్వానికి సిగ్గుపడక పోగా మరీ హైదరబాదులో బస్ దిగు అనటానికి "ఉతార్" అంటారు రా మరి ఇక్కడ ? అని ఒక వెర్రిప్రశ్న వేసా! దానికి బదులు ఇస్తున్నట్టుగా ఇక్కడ బస్ కదిలే లోపే ఎక్కెయాలి రా గుర్తుపెట్టుకో అన్నాడు(సాధారణంగా మనం అడిగిన ప్రశ్నకి ఎప్పుడూ సమాధానం ఇవ్వడు కాబట్టి ....పెద్దగా పట్టించుకోలేదు ). దానికి నేను ఆ విషయం గురించి "తూ ఫికర్ మత్" అని అప్పుడప్పుడే వంటపడుతున్న హైదరాబాదీ హిందీలో చెపుతూ "హైదరాబదులో రన్నింగ్ బస్ ఎక్కటం, పైగా ఫుట్‌బోర్డ్ మీద ఫుల్ల్ గా వేలాడుతూ వెల్లటంలో నేను కింగ్‌రా " అని హైదరబాదు గొప్పలకి పోయా.వెంటనే , ఇక్కడ నువ్వు వెలాడతానన్న బస్ కదిలాక ఎక్క నివ్వరు ఎందుకంటే ఇక్కడ బస్సులు అన్నిటికీ ఆటోమేటిక్ డోర్లు; బస్ కదలగానే మూసుకుపోతాయి అన్నాడు. అంతే అప్పుడు అర్ధం అయ్యింది బెంగుళూరులో చాల బొమ్మలాటలున్నాయి అని.

నెమ్మదిగా నా అర చేతి నొప్పులు తగ్గాయి అనుకునే లోపల మనం దిగాల్సిన స్టాపు వస్తుంది లగేజి అదీ తీసుకో అన్నాడు.హడావిడిగా అన్నీ తీసుకుని ఆటో పిలవరా అన్నా , హెయ్ ఎందుకు రా రూం ఇక్కడే పదా అన్నాడు, చేసేదిలేక మొహమాటంగా వాడి అడుగులో అడుగేస్తూ దిక్కులు చూడకుండా (ఎందుకంటే చుసేలాగా పరిస్తితి లేదుకాబట్టి!) కొంత సేపటికి రూంకి చేరాను.ఇదే రా నీ రూం ఒకే గది విత్ అటాచిడ్ బాత్‌రూం, ఎలా ఉంది అన్నాడు? వచ్హేసరికి రూం తీసాడు అదే చాలు చిన్నదైతే ఏముందిలే ..బాగుంది రా మాకు సరిపోతుంది (త్వరలో నాలాగా హైదరాబాదు నుండీ రాబోతున్న ఇంకో ఫ్రెండ్ ని దృష్టిలో పెట్టుకుని ) అన్నాను.

సరే అయితే నువ్వు స్నానం అదీ చేయ్ నేను ఆఫీస్కి వెల్తా ఇప్పటికే ట్రైను లేటు అవ్వటంతో బాగా ఆలస్యం అయ్యింది అంటూ బయలుదేరాడు.ఒహో! ఇప్పటివరకూ అదా వీడి అందోళణ ఎంటా అనుకున్నా! షాపింగ్ కి వెళ్ళాలిరా ఉంటావనుకున్న సరేలే సరదగా ఏరియా అదీ చూసినట్టు ఉంటుంది నేనే వెల్తానులే అన్నా! ఆ రోజంతా ఎదో స్నానం చేసినా గని ఒకటే చిరాకు. దగ్గరలోనే ఉదయం మా వాడు వస్తున్నప్పుడు చూపించిన హోటల్లో టిఫిన్ కూడా నచ్హలేదు. బహుసా ఇదంతా హైదరాబాదుకి అలవాటుపడటంవల్లనేమో. ఇక్కడ నీళ్ళు బాగా చల్లగా ఉంటాయి హీటరు అవసరం అనటంతో అది కొందామని బయటకి వెళ్ళి దానితో పాటుగా ఖర్చులు తగ్గించాలి అన్న ఉద్దెశ్యంతో ఒక ఐరన్ బాక్స్ కొని రూంకి చేరా...

అప్పుడు మోదలు అసలు సినిమా ! అర చెయ్య అంతా ఒకటే దురద, మంటలు. బహుసా ఇక్కడ నీళ్ళు పడలేదేమో అని సర్దుకుని ఓర్చుకున్నా, ఆ రాత్రికి ఎలాగో గడిచింది. తెల్లవారినా నాకూ పెద్దగా తేడా తెలియలేదు. అంతకుముందు రోజు ఆ బిల్డింగ్‌లో ఉన్న ఒక ఫ్రెండ్ ని ఆరు సార్లూ ఆ ఏరియా పేరు అడిగి తెలుసుకోవటంతో నా అమాయకత్వం నచ్హి , నా దగ్గరకి వచ్హి టిఫిన్ అయ్యిందా అన్నాడు ? టిఫిన్ కోసం పెద్ద బాద లేదు గని అర్జంటుగా డాక్టరు ద్గ్గరికి వెళ్ళాలి ఎదైనా చెప్పు అన్నాను. తెల్లమోహం వేయటంతో నేనే రోడ్డున పడ్డా, ఉదయానే కావటంతో పెద్దగా ప్రయోజనంలేకపోయింది. కొంతసేపటికి కేరళా ఆయుర్వేద శాల అని కనపడింది. ఎదొ ఒకటే సమస్య పక్క వాడికి చెప్తే ఉపశమనం ఉంటుందని లోపలికి వెళ్ళా, లేడీ డాక్టర్ ! కొంచం సిగ్గు, అయినాగని అడగటంతో అరచేతులు చూపిస్తూ కెవలం అరచేతులు మాత్రమే మంట మరియూ దురదా అని చెప్పా !!

వెంటనే ఆమే నిన్న తాడు లాగటం ఎదినా బరువయిన దానిని లాగటం చేసారా అనటంతో అప్పుడు ఎలిగింది లైటు. అవును డాక్టర్ నిన్న కాస్త బరువైన లగేజీ మోసాను అన్నా !! దానితో డాక్టరు ఒక చిరునవ్వు నవ్వీ ఈ ఆయిలు అరచేతికి రాసి అరగంట ఆరనివ్వాలి, ఆ తర్వాత గోరువెచ్హని నీటిలో మరో అరగంట నాన నివ్వాలి అని చెప్పింది. అన్ని విన్నను గానీ అసలు కారణం తెలుసుకోవాలి అనిపించటంతో దాచుకోలేక అడిగేసా , డాకటరు చెప్పింది ఏమిటంటే తనకి మించిన బరువుని మోయటంవల్ల అర చేతిలో సున్నితమయిన చాలా రక్త నాళాలు తెగిపొయాయి అనీనూ దాని కారణంగా విస్రుతంగా పొంగిన రక్తం చర్మపు అడుగు పొరలో ఉండిపోవటం వల్ల రాన్నున రోజుల్లో అర చేయి పలు రంగులు ప్రదర్సిస్తుందనీను చెప్పింది.అవన్నీ విన్న నాకు ఒక్క క్షణంలో చాలా రంగులే కనపడ్డాయి.

నిన్న కొన్న హీటరు ఇలా ఉపయోగపడిందన్నమాట అనుకుని, దాన్ని నీళ్ళలో పెట్టా. ఆ కేరళా ఎర్ర ఆముధాన్ని అరచేతికి రాసుకుంటూ "కూటి కోసం, కూలి కోసం, పట్నమొచ్హిన బాటసారీ ఎంత కష్టం ..ఎంత కష్టం ....." అని శ్రీ శ్రీ గారి పాట పాడుకుంటూ, సమస్య ఇట్టే పసిగట్టిన కేరళా లేడీ డాక్టరుని ఊహించుకుంటూ, ఎప్పుడో నాన్న అన్న మాటలు నెమరువేసుకున్నా !! అవి ఎమిటంటే ఇంటిదగ్గర పెరటిలో చిరాకుగా పెరిగిన చెట్లని కొడుతున్న నాన్న కి సహాయం చెద్దామని దగ్గరకి వెల్తే "మీరు కంప్యూటర్ మీద చేతులు ఆడించటానికే గనీ దేనికి పనికిరారు రా" అనేవారు . అది గుర్తు రావటంతోనే సినిమాలో లాగా మూటలు మోసి అయినా...అనే ఆలోచనలకి తెర దించేసా..మొత్తానికి నా చేతులు కాస్త సరి అవ్వటానికి, నేను బెంగుళూరుకి అలవాటుపడటానికి కొంత సమయం పట్టింది.

ఇంతలో రానే వచ్హింది కాలేజి నుండి కాల్ ! అది సత్యం ఆఫ్‌కాంపస్. పరీక్ష అంధ్రాలో కావటంతో ఎదైనా పొయిన చోటే వెతుక్కొవాలి అన్న చందాన ఈ సారి ఎలగయినా సత్యంలో సీటు సంపాదించాలని అత్యుత్సాహంతో బయలుదేరా, రైల్వే స్టేషన్‌కి టికెట్ట్ బుక్ చేయటానికి. మొత్తనికి సత్యంకి సంబందించిన చాల మంది దగ్గర విజయగాదలు విని (పరీక్ష కి సంబందించిన వివరాలు, ఇంటర్వ్యూలో ఆడిగే ప్రశ్నలూ) బాగా బుర్రకి ఎక్కించుకుని ఇంటికి ప్రాయాణం అయ్యా !

"అమ్మ కడుపు చూస్తుంది , పెళ్ళాం జేబు చూస్తుంది" అన్నట్టు; ఇంటికి వెల్లగానే చుట్టు పక్కన వాళ్ళు ఇంకా జాబ్ రాలేదా ?? (అప్పటికి పెళ్ళాం లేక పొయినా ...ఆ మాదిరి) అనీనూ అమ్మెమో ఆ చేతులు ఎమిటిరా అలా అయిపోయాయి అనడంతో ఒక్కసారి కావేరీ కళ్ళలో కట్టలు తెంచుకున్నంత పర్యంతం అయ్యింది. మొత్తానికి చేతి వంకన అమ్మ చేతి గోరుముద్దలు తింటూ(ఇప్పటికీ తింటూనే ఉంటాననుకోండి !! అంత రుచిగా ఉంటుంది మరి) ఎక్సాంకోసం ప్రెపేర్ అవుతున్న నాకు అమ్మ నెమ్మదిగా నీకు సత్యం రాదేమో రా !!అంది. అదేంటమ్మా? అంత మాటాన్నావు ?-"నీ జాతకంలో నీకు జాబ్ ఇటుగా రాదు పైగా అది వచ్హే నెలలో వస్తుంది అని ఉందిరా అంది"పెద్దగా షాక్ తినలేదు గని అమ్మ ఇలానే అంటుంది అనుకుని మరుసటి ఉదయం ఎంచక్కా ఎక్సాం కి వెళ్ళా, మొదటి రెండు రౌండ్లూ సెలెక్ట్ అయి పోయా ఇక ఫైనల్ రౌండ్ చాలా సులువు వచ్హేసినట్టే అన్న ధీమాతో అమ్మకి ఫోన్ చేసి గొప్పగా చెప్పా! కానీ ఆశ్చర్యంగా ఆఖరి రౌండ్ తేడా చేసెసింది. నా ఉత్సహాం మొత్తం నీరు గారి పొయింది. మొత్తానికి అమ్మ చెప్పినట్టే జరిగిందనిపించింది. చేసేది లేక ఇంటి ముఖం పట్టాను.

ఆ మరుసటి రోజు ఇంకో రెండు రోజులలో మళ్ళీ బెంగుళూరు వెళ్ళబోతాననగా గుడికి తీసుకెళ్ళి ఎదో పూజ చెయించి మన చేతికి ఒక గోమెధకం రాయి ఉన్న ఉంగరం తొడిగించారు నాన్న. ఎంటో జాబ్ లేని నా మీద ఇంకా నాన్న కి ఇంత ప్రేమ అనుకుని ఇంటికెళ్ళా, అప్పుడు అమ్మ చెప్పిందేమిటి అంటే జాతక ప్రకారం ఆ కాలంలో ఉన్న అకాల దోషాలన్నీ పోవాలనీ ఆ ఉంగరం చెయించామని చెప్పింది. కామన్‌గానే అమ్మ చెప్పేది లక్ష్య పెట్టకుండా,"అంటే ఇది పెట్టుకుంటే జాబ్ వచ్హేస్తునందా అని వెటకరించా !!" మొత్తానికి దానిగురించి నేను మరచిపొయినా కొత్తగా చూసిన ఫ్రెండ్స్ అంతా "ఎమిటి రా వేలు వాచింది?" అంటూ అమ్మ అన్న మాటలు గుర్తుచేస్తూనే ఉన్నాయి.

మొత్తానికి బెంగుళూరు చేరీ చేరగానే ఒక ఫ్రెండు వాడికి జాబ్ ఇచ్హిన కన్సల్‌టెన్సీ లో ఇంకా జాబులు ఉన్నాయి అని చెప్పటంతో వెంటనే అక్కడికి చేరా!వాళ్ళు పెట్టిన పరీక్షలూ ఇంటర్వ్యూలలో మెప్పించటంతో తరువాయి ఫైనల్ క్లైంటు రౌండు SAP Labs లో అని చెప్పాడు. దానితో పాటు మనకి డ్రెస్సింగు గురించి కూడా కొన్ని సముచిత సలహాలు ఇచ్హి పంపాడు.

మొత్తానికి SAP labs లో ఇంటర్వ్యూ కి వెల్లిన నాకు అది నిజంగా మరచిపొలేని రోజు. కంపెనీ పిచ్హెక్కించింది అంటే నమ్మండి పెద్ద కార్ పార్కింగ్ ప్రాగణం అన్నీ పెద్ద కారులే, అద్దాల మేడ మెరిసిపోతుంది, నా ఇంటర్వ్యూ మిట్టమద్యానం కావటంతో సూర్యకిరణాల సరాసరి ఆ అద్దలమేడ మీద పడి నా కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. ఆ తళుకు బెళుకుల తన్మయత్వం నుండీ తప్పించుకుని నెమ్మదిగా నా ఇంటర్వ్యూ గదికి చేరుకున్నా. బయట ఎండ వేడి తట్టుకొలేకపొయా అని బాధ తో లోపలికి అడుగుపెడితే లోపల AC దెబ్బకి చలి బాధ ఎక్కువయింది. అలానే నెమ్మదిగా వళ్ళు పెట్టిన పరీక్ష ఉత్తీర్నుడనవ్వటంతో వెంటనే ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పి అక్కడే వెయిట్ చేయమన్నారు.

నిజంగా నా జీవితంలో అదొక మరుపురాని ఇంటర్వ్యూ అని చెప్పాలి, కొంతసేపటికి ప్రారంభమయిన ఆ ఇంటవ్యూలో నాకు కొన్ని పజిల్స్ ఇచ్హరు అవి సాల్వు చేసిన పిమ్మట ఒకే ఒక్క ప్రశ్న అడిగారు, అదే నాకు నచ్హిన సినిమా ఎమిటి అని ? తడపడ కుండా అప్పట్లో ఫ్రెండ్ తెచ్హిన DVD లో చూసి నాకు బాగా బాగా బాగా నచ్హిన సినిమా అయిన "రంగ్ దే బసంతి" (Rang de basanti) అని చెప్పా. వెంటనే ఆ మెనేజర్ మొహంలో ఒక చిరునవ్వు. నాకు దాని అర్దం అప్పుడు తెలీదు , వెనువెంటనే ఆ సినిమా గురించి చెప్పమన్నాడు, ఇంకా అది ఎందుకు నచ్హిందో చెప్పమని అన్నాడు - దానితో ఎక్కువ ఎమీ ఆలోచించకుండానే నాకు అందులో నచ్హిన పలు పాసిటివ్ విషయాలన్నీ గుర్తు చేసా. దానితో ఇంప్రెస్స్ అయిపొయిన మేనేజరు కన్సెల్టెన్సీ వాళ్ళు నాకు మిగిలిన విషయాలు చెప్తారని ఇక వెళ్ళవచ్హు అని చెప్పాడు, దానితో సంత్రుప్తి చెందని నేను వెంటనే నా మనసు తెలియచెయటంతో, (It is a +ve sign, Be happy)అని చెప్పటంతో నా ఆనందానికి అవధులు లేవు. అలా రూంకి వచ్హిన తర్వాత కొన్ని వారాలు గడిచాయి, "ఎడారిలో ఒయాశిసులా తలచిన" నా ఇనటర్వ్యూ ఎటువంటి ఆఫర్ ఇవ్వకపోవటంతో ఇక అదికేవలం "ఎండమావి" అనుకుని నీళ్ళొదిలేసా!!

అలా అది జరిగిన కొన్నాళ్ళకే ఎప్పుడో దరకాస్థు చేసిన మా ఫ్రెండు వాళ్ళ కంపెనీ నుండీ ఒక కాల్ వచ్హింది తరువత రొజే రాత పరీక్షకి రావలని; మళ్ళీ అమృతంపై ఆశలు చిగురించాయి, వెంటనే నాతో పాటు ఉద్యోగప్రయత్నం చేస్తున్న మిగిలిన స్నేహితులల్కి కూడా పరీక్షకి తయ్యరు అవ్వలని చెప్పాను.మరుసటిరోజు అందరం కలిసి "నెస్స్"(Ness) కంపెనీ కి చేరుకున్నాం, కాని అక్కడి పరిస్తితి కేవలం కాల్ లెటరు ఉన్న వారినే అనుమతిస్తున్నారు అని తెలియటంతో మా అందరి తెలివి తేటలూ చూపించి సెక్యూరిటీ కళ్ళు గప్పి మొత్తానికి అందరం కలిసే లోపలికి ప్రవేసించాము. పరీక్షకి తయారు అయ్యాము, కానీ ఇలాంటివి అప్పటికే చాలా సార్లు చూసిన ఆ కంపెనీ HR లు సులువుగా కాల్ లేటరు లేని నా స్నేహితులని గుర్తించేసారు. కానీ పరీక్షలో ఎక్కువ మార్కులు రావటంతో మా రిక్వస్ట్‌ని గుర్తించి మిగిలిన రౌండ్లకి అనుమతించారు, ఆ రోజు మాతో పరీక్షలు రాసిన మొత్తం 58 మందిలో చాలా రౌండ్లు నేనూ నా స్నేహితులు దాటగలిగాము. కానీ ఒక స్నేహితుడు మద్య రౌండులో వైదొలగాడు. మొత్తనికి ఆ 58 మందిలో అఖరుకి సెలెక్ట్ అయిన ఇద్దరూ నేనూ నా మిత్రుడే!నిజానికి అక్కడ జరిగిన ఇంటర్వ్యూలలో మా విజయానికి కారణం అయిన మా మిత్రులు(అదే కంపెనీలో పనిచేసే వాళ్ళు) మాకు నిజంగా ఎంతో నైతిక ధైర్యం ఇచ్హారనే చెప్పాలి.

అఖరి రౌండ్ అయిన తర్వాత నన్ను మేనెజరు ఒక సారి చూడాలని కోరారనీ, ఆయన ఊళ్ళో లేని కారణంగా 2 రోజులు ఎదురుచూడాలని కోరటంతో మళ్ళీ నిరాశతో ఇంటికి వచ్హేసా ! ఇంక ఇది కూడా "ఎండ మావే" అని తలిచా!!! కూర్చున్నా, పడుకునా; పోరాడినా ఆ కంపెనీ ప్రాగణం, ఇంటర్వ్యూలో చాకచక్యం గా ఇచ్హిన జవాబులే బాగా వెంటాడ సాగాయి. అయినా రోజూ AC లో తిరిగే ఆ మేనేజరు "ఎండకి ఎండీ, వడదెబ్బకి వాడిపొయిన" నా మొహం ఎమి చూస్తాడబ్బా , ఇదంతా కేవలం కల్లబొల్లి కబుర్లే అని అనుకుని ఇక మన బతుకు ఇంతే అని వదిలేసా. మళ్ళీ అదే కంపెనీ నుండీ కాల్ వచ్హింది - మరుసటి రోజు రావాలని; ఆ రోజు "ఉగాది" (March 31 2006)పండుగ. తీరా వెల్లగానే నాకు ఒక నామమాత్రపు ఇంటర్వ్యు నిర్వహించి ఆఫర్ లెటరు చేతిలో పెట్టారు. దానితో నాకు 2006 ఉగాది పండగా కేవలం తీపి రుచిని మాత్రమే ఇచ్హింది.ఆ తీపిని స్నేహితులతో పంచుకునేందుకు అష్ట-కష్టాలు పడీ ఆ రాత్రి రూం కి చేరాను.

ఆ విధంగా సిలికాన్ సిటీలో సెర్చింగ్ నాకు ఉద్యాన నగరిని చిరస్మరణీయం చేస్తూ నా జీవతాన్నీ ఉగాది రోజునే ఉపాధి చూపిస్తూ పూలు చల్లిందనే చెప్పాలి.ఆ రోజు వేసిన తొలి అడుగూ నన్ను సప్త సముద్రాలని కాకపొయినా కొన్ని సముద్రాలని అయినా సునాయసంగా దాటిస్తూ అమెరికాయానం చేయించింది. ఆఫీసులో నేర్చిన పలు విషయాలూ , ఇంకా నా అమెరికా ముచ్హట్లతో తదుపరి టపాలో దర్శనమిస్తా!!!

ఉద్యోగపర్వం
అమాయకంగా అమెరికాయానం...(ఉద్యోగపర్వం - చతుర్దాశ్వాసం )
మాంద్యం దెబ్బ - మరో జాబ్ దొరికిందబ్బా !! (ఉద్యోగపర్వం - పంచమశ్వాసం) * Coming soon *

5 comments:

trivikram.sreenivas said...

chadivanu, roju roju ki nee rachana saili lo entha morpu, professional writer avuthunnavugaa...

Teja said...

Entha oopikaga, ne teepi gnyapakalanu andaramundu unche , andharino entho anandhaparuchunna ne kalam kadalikalanu appakunda , munduku saagi po neestam ..

ne uchaha oopikalaku , uppenalu urruthaladuthunnaye ...

God bless :)

Anonymous said...

you don't look like as so expressive..but once started reading u r blogs, u have really got good skils to put down the feelings in to blog (How much is required)

Krishna said...

Hello Mr.Anonymous .."you don't look like as so expressive".మనిషిని చూసి మీరు చెప్పగలరంటే నేను కూడా నమ్మ లేక పోతున్నా ! కొంప తీయకుండా నన్ను మీరు ఎప్పుడయినా చూసారా ఏమిటి ? నన్ను చూడకపొయినా నా టపాలు చదివితే నా ఖచ్హితమయిన వ్యక్తిత్వం మేకే అర్దం అవుతుంది ...ప్రయత్నిచండి ... ఏది ఎమయినా నా బ్లాగుకి వచ్హినందుకు నా టపా చదివినందుకు ధన్యవాదాలు !! ఇంకా ఒక కామెంటు రాసినందుకు శతకోటి ధన్యవాదాలు ... ఈ మద్య నేను టపాలు రాయక బొత్తిగా కామెంట్లు కూడా చూడలేదు. త్వరలోనే మాంద్యం దెబ్బ - మరో జాబ్ దొరికిందబ్బా !! (ఉద్యోగపర్వం - పంచమశ్వాసం) ....

Anonymous said...

ha ha ha ..kompa teeyakunda emi kadhu kani ..just i know you..anyways good going with your telugu words and all.. little funny also

Post a Comment

వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...